Collectorate | వేమనకు ఘన నివాళి

Collectorate | వేమనకు ఘన నివాళి
- నివాళులర్పించిన కలెక్టర్ సుమిత్ కుమార్
Collectorate | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన ప్రజాకవి యోగి వేమన అని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ రోజు స్థానిక కలెక్టరేట్‌లో వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో మోహన్ కుమార్, బీజేపీ ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, ప్రసన్నకుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేమన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమని, ఆటవెలదిలో సరళమైన రీతిలో హృదయాలకు హత్తుకునే విధంగా ఆయన పద్య రచన చేశారని పేర్కొన్నారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

సమాజ చైతన్యానికి అవసరమైన సలహాలు, సూచనలు, విలువలతో కూడిన రచనలు చేసిన మహనీయుడిగా వేమనను ఆయన అభివర్ణించారు. ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని చేర్చారని తెలిపారు. మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేసిన కవి వేమన అని, ఆయన రచనలలోని భావాలను బట్టి గొప్ప మానవతావాదిగా చూడవచ్చని అన్నారు. వేమన పద్యాలు ఆంగ్లం సహా ఐరోపా భాషలన్నింటిలోను, అన్ని ద్రవిడ భాషలలోను అనువదించబడినట్లు చెప్పారు. ఐక్యరాజ్య సమితి యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో ఒకరిగా యోగి వేమనను గుర్తించడం తెలుగు వారికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచిన మహోన్నత వ్యక్తి యోగి వేమనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టూరిజం ప్రతినిధి గౌరీ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు హరికృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
