ససా దినోత్సవం.. జెడ్పీలో మొక్కలు నాటిన అధికారులు…
శ్రమదానంతో కార్యాలయాల పరిశుభ్రతకు శ్రీకారం
కర్నూలు, జులై 18 (ఆంధ్రప్రభ) : ససా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా పరిషత్ (జెడ్పీ) కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శనివారం మొక్కలు నాటడంతో పాటు స్వచ్ఛత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన కార్యాలయాల నిర్వహణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), కర్నూలు ఎంపీడీఓ, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (ఏఓలు), జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల సిబ్బంది కలిసి కార్యాలయ ఆవరణలో వివిధ రకాల నీడనిచ్చే మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.
అనంతరం శ్రమదానంలో భాగంగా కార్యాలయ ప్రాంగణం, రికార్డు గదులు, కార్యాలయ పరిసరాలను అధికారులు, సిబ్బంది కలిసి శుభ్రం చేశారు. పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం ఉద్యోగుల్లో పనితీరును మెరుగుపరచడమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ…. ప్రతి ఉద్యోగి తన పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనం పెంపొందించడం, పరిశుభ్రత పాటించడం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల ఏఓలు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, అటెండర్లు తదితరులు పాల్గొన్నారు.
