వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
సబ్స్టేషన్ల తనిఖీలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
చెన్నూర్, ఆంధ్రప్రభ: వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే విద్యుత్ శాఖ ప్రధాన లక్ష్యమని విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు.
బుధవారం సాయంత్రం చెన్నూర్, కోటపల్లి, భీమారం సబ్స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యుత్ సరఫరా, భద్రతా ప్రమాణాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సబ్స్టేషన్లలో విద్యుత్ సరఫరా తీరు, సాంకేతిక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం సిబ్బంది పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. లైన్మెన్లు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది విధి నిర్వహణ సమయంలో తప్పనిసరిగా సేఫ్టీ కిట్లను ఉపయోగించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని సిబ్బందిని హెచ్చరించారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఈఈలు, డీఈలు, స్థానిక సబ్స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
