డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

డిపో ఎదుట ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన

  • బ్రీత్ అనలైజర్ యంత్రం సరిగ్గా పని చేయడం లేదని ఆగ్రహం
  • మిషిన్ వ్యవహారం పై గతంలోనే చెప్పిన ‘ఆంధ్రప్రభ’

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. నిరంతరం మద్యం పరీక్షలు జరిపే బ్రీత్ అనలైజర్ యంత్రం సరిగ్గా పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపోద్రిక్తులైన డ్రైవర్లు డిపో ఎదుట బైఠాయించారు. ఆదివారం రాత్రి విధుల్లోకి వచ్చిన డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ తో పరీక్షలు నిర్వహించగా 56 మందికి పైగా మద్యం తాగినట్లు చూపించింది. దీంతో ఆగ్రహం చెందిన డ్రైవర్లు వెంటనే పాడై పోయిన యంత్రం తెచ్చి తమను వేధిస్తున్నారని డ్రైవర్లు మండిపడ్డారు. మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మెషిన్ తాగినట్లు చూపిస్తున్నదని, దీంతో అధికారులు తమను విధుల్లోకి తీసుకోవడం లేదని డిపో ఎదుట బైఠాయించిన డ్రైవర్లు వాపోయారు. అసలు తాము మద్యం తాగలేదని, వెంటనే మిషిన్ మార్చాలని డిమాండ్ చేశారు.

గతంలోనే చెప్పిన ‘ఆంధ్రప్రభ’…!
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో బ్రీత్ అనలైజర్ యంత్రం విషయం పై గతంలోనే ‘ఆంధ్రప్రభ’లో ప్రత్యేక కథనం వచ్చింది. సరిగ్గా పని చేయని యంత్రం తెచ్చి డ్రైవర్లను వేధిస్తున్నారని, మిషిన్ రిపోర్టు ఆధారంగా విధుల్లోకి తీసుకోవడం లేదని చెప్పింది. అయినా.. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ‘ఆంధ్రప్రభ’లో ప్రచురితమైన వార్తలో నిజం లేదని దాటవేశారు. మరి ఇప్పుడు ఈ ఘటనతో ఆర్టీసీ అధికారులు ఏం సమాధానం చెబుతారో..!

Leave a Reply