కూడళ్లు, డివైడర్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
కూడళ్లు, డివైడర్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
- ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన కమిషనర్ శారదా దేవి
- పిచ్చి మొక్కలు, చెత్తచెదారం తొలగించాలని ఆదేశం
- సీసీ రోడ్డు పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సూచన
తిరుపతి, ఆంధ్రప్రభ : నగరంలోని ప్రధాన కూడళ్లు, డివైడర్ల వద్ద చెత్తచెదారం తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, గాంధీ విగ్రహం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లు, డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు, చెత్తచెదారం అధికంగా ఉన్నట్లు గుర్తించిన కమిషనర్, నగరంలోని అన్ని ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

అలాగే ఎండిపోయిన మొక్కలను తొలగించి, ఖాళీ ప్రదేశాల్లో కొత్త మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. రోడ్లపై పేరుకుపోయే చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని, కాలువల్లో చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం ప్రకాశం పార్కు వెనుక నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన శారదా దేవి, పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్ సుమతి, పారిశుధ్య సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

