విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు..

  • రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు నివేదిక
  • సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురు ప్రముఖుల హాజరు
  • సుమారు 30 వేల మంది లబ్ధిదారులతో సభ నిర్వహణ

తిరుపతి, ఆంధ్ర‌ప్ర‌భ : తిరుపతిలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాసభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. “నమ్మకం–అభివృద్ధి–సంక్షేమం” అనే అంశాలపై ఈ సభను మంగళవారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు రాష్ట్ర మంత్రులు, రాయలసీమ ప్రాంత శాసనసభ్యులు, ఎంపీలు, వివిధ స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.

గత ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు దిశగా రెండేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు వివరించేందుకు ఈ సభ వేదిక కానుందని పేర్కొన్నారు. సుమారు 30 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు సభలో ప్రజల ముందుంచనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు.
మహిళలకు రాజకీయాల్లో 33 శాతం ప్రాధాన్యత కల్పించాలన్న నారా లోకేష్ ప్రకటన స్వాగతార్హమని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి, ఐదు రూపాయలకే భోజనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రజల నుంచి మంచి ఆదరణ, ఆశీర్వాదాలు లభిస్తున్నాయని పనబాక లక్ష్మి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవి నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, పార్టీ నాయకులు జేబీ శ్రీనివాసులు, రూపేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply