ఏడాదిలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
ఏడాదిలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
-ప్రతి ఎకరానికి సాగునీరు
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి, ఆంధ్రప్రభ:
నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఏడాదిలోపు నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామంలో రూ. 7.65 లక్షలతో పెద్ద చెరువు తూము మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వ పాలనలో అనేక సాగు నీటి ప్రాజెక్టు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పూర్తి చేయకపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 1,000 కోట్లు అవసరమని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అంగీకరించినట్లు, నియోజకవర్గంలోని పత్తిపాక రిజర్వాయర్, అక్కపల్లి లిఫ్ట్, మేడారం రిజర్వాయర్ నుండి కొత్తపల్లి వరకు కాలువ పనులతో పాటు మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
చెక్కుల పంపిణీ..
గొల్లపల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మండల పరిషత్ కార్యాలయంలో అందజేశారు. మండలంలోని 17 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయగా 72 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 26 లక్షల 12 వేల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
పోచమ్మ బోనాల్లో పాల్గొన్న మంత్రి
గొల్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైండ్ల పూజారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గ ప్రజలను ఎల్లవేళలా పోచమ్మ తల్లి చల్లగా చూడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ తో పాటు నాయకులు నిశాంత్ రెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్ తో పాటు మండలంలోని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
