Rs.90.67 | పెట్రో వాత !

Rs.90.67 | పెట్రో వాత !
Rs.90.67 | రాత్రికి రాత్రికి పెరిగిన చమురు ధరలు
పెట్రోల్, డీజిల్ పై రూ.3 అదనపు వడ్డన
సీఎన్జీ పై కూడా రెండు రూపాయిలు..
మూడున్నరేళ్ల తర్వాత ఆయిల్ ధరలు పెంపు
Rs.90.67 | న్యూ ఢిల్లీ,ఆంధ్రప్రభ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై నేరుగా ప్రభావం పడుతోంది. తాజాగా, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 చొప్పున పెంచేశారు. యుద్ధ సంక్షోభం నేపథ్యంలోనే ఈ చమురు ధరలు భారత్‌లో హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా మన దేశంలో గ్యాస్ ధరలుపెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలపై మూడు రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తర్వాత సీఎన్జీ ధరను కూడా రూ. 2 పెంచారు.
ఆయా నగరాల్లో ధరలు ఇలా..
పెరిగిన పెట్రోల్ ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.72 వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.67 వద్ద ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.112.64, లీటర్ డీజిల్ ధర రూ.100.34 కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటరుకు రూ. 110.89కి చేరుకోగా, డీజిల్ లీటరుకు రూ. 99.96 ఉంది. ఇక CNG ధర కూడా కిలోపై రూ. 2 పెరిగింది.
తగినంతగా ఇంధన నిల్వలు
ఇది ఇలా ఉంటే , ఈ వారం మొదట్లో కేంద్ర చమురు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. తక్షణ సరఫరా అంతరాయాన్ని నివారించడానికి భారతదేశం వద్ద ప్రస్తుతం తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని అన్నారు. గత 75 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. కానీ గత 4 ఏళ్లుగా ధరలు పెంచలేదని, ప్రపంచంలో ఇలా చేయని ఏకైక దేశం మనమే అంటే కేంద్రం చెబుతోంది. చివరిసారిగా 2022లో ధరలు పెంచినట్లు పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు.
సామాన్యుడి జేబుకి ఇక చిల్లే..
ఆటోలు, క్యాబ్‌లు, బస్సుల నిర్వహణ ఖర్చు పెరగడంతో సామాన్యుల ప్రయాణ భారంగా మారనుంది. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 పైగా పెరగడంతో బెంబేలెత్తిపోతున్న సామాన్యుడికి ఈ సీఎన్జీ ధరల పెంపుతో మరింత భారంగా మారనుంది. హర్మూజ్ జలసంధి సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
