51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
నరసరావుపేట, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నరసరావుపేట పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులు, ఎల్‌వోసీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లబ్ధిదారులకు చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 63 మంజూరులకు సంబంధించి రూ.65,97,740 విలువైన సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.
ఇందులో 51 మంది లబ్ధిదారులకు రూ.45,73,417 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం 12 మందికి రూ.20,24,593 విలువైన ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ నిరుపేదలు, బాధితులకు ఆపత్కాలంలో సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.
