సమరయోధుల త్యాగాలు మరువలేనివి..
- ఎంపీపీ సుహాసిని అనిల్‌కుమార్
శావల్యాపురం, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మరువలేనివని, వారి పోరాట ఫలితాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని ఎంపీపీ ముండ్లమూరి సుహాసిని అనిల్‌కుమార్ అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో పేరుమీన సీతారామయ్య ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీపీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముండ్లమూరి సుహాసిని అనిల్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావాలను పెంపొందించుకుని దేశ పురోగతికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రాథమిక, జిల్లా పరిషత్, ప్రైవేట్ పాఠశాలలు, సహకార పరపతి సంఘాల్లో ఆయా కార్యాలయాల అధికారుల సమక్షంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు ఉదయాన్నే లేచి వివిధ వేషధారణల్లో ముస్తాబై సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
శావల్యాపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై మోర్ల వెంకటేష్ బాబు సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంఈఓ కార్యాలయంలో మద్దికుంట సాంబశివరావు, పుసులూరి లలితకుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రంథాలయంలో అధికారి రావూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిన్నారులతో కలిసి జెండా వందనం చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ రావిపూడి రమ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శ్రీరామ పాఠశాలలో కరస్పాండెంట్ కెవీఆర్ మోహన్‌చంద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. కారుమంచి ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను హెచ్ఎం యాకూబ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులతో జాతీయ గీతాన్ని ఆలపించారు. గత రెండు రోజులుగా నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, మిఠాయిలు పంచిపెట్టారు. అదేవిధంగా గ్రామ సచివాలయాల్లో కార్యదర్శుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
