పేదరిక నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు

ఏలూరు, ఆంధ్రప్రభ: వికసిత్ భారత్–స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అందించిన మహనీయులను, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి కలలను సాకారం చేసేందుకు స్వాతంత్ర్య అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ విధానాలను రూపొందిస్తూ, సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి సుపరిపాలన అందిస్తోందన్నారు.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలవరం పనులు తిరిగి పునరుజ్జీవం పొందాయని, గోదావరి పుష్కరాలకు ముందుగానే 2027 మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు.

భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా పేరుగాంచనున్న అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన బృహత్తర కార్యక్రమంపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం ప్రచురించిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి సంకల్పదీక్షతో పనిచేస్తున్నారని, ఆయన మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఘనచరిత్రను లిఖించడం ఖాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ అదే నిబద్ధతతో పనిచేసి స్వర్ణాంధ్రను సాకారం చేయాలని కోరారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉంటాయని బలంగా విశ్వసిస్తున్నామని, అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలోని అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లను రూ.4 వేలకు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవలో వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

పేదరికం లేని సమాజ నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్య మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ వంటి పది సూత్రాలతో స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానమని, సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది, అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చన్నారు. పీ4 పీపుల్, పబ్లిక్, ప్రైవేట్, పార్ట్‌నర్‌షిప్ విధానంలో జీరో పావర్టీ సాధనకు కృషి చేసి ఆర్థిక అసమానతలను తగ్గిస్తామని చెప్పారు.

జిల్లాలో 71,910 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని, ఇప్పటివరకు 44,114 కుటుంబాలను 4,853 మంది మార్గదర్శులతో దత్తత తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరిస్తున్న మార్గదర్శులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 2 కోట్ల 12 లక్షల 87 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు.

దివ్యాంగ శక్తి ద్వారా లక్షా 6 వేల 886 మంది దివ్యాంగులు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందారన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 5,502 మందికి చెందిన 5,520.81 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి వారి కళ్లల్లో ఆనందాన్ని చూశామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 662 గ్రామాల్లో భూ రికార్డులను కంప్యూటరీకరించామని, రాజముద్రతో ముద్రించిన 1,24,207 పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించామని తెలిపారు. భూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు జరగకుండా బ్లాక్‌చైన్ సాంకేతికతతో పూర్తి భద్రతా ప్రమాణాలతో రెవెన్యూ రికార్డులను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి 1,60,968 మంది రైతులకు మొదటి విడతగా రూ.106.29 కోట్లను వ్యవసాయ పెట్టుబడి సాయంగా విడుదల చేశామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 33,824 మంది కౌలు రైతులకు పంట సాగుదారుల హక్కు పత్రాలు అందించి, 3,401 మంది రైతులకు రూ.20.4 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. 30,062 భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశామని, ఖరీఫ్ 2026 సాగుకు 55,450 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. సూపర్ ఎల్‌నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యతపై గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న సాగునీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఇరిగేషన్ అధికారులు, సాగునీటి వినియోగదారుల సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

రైతులకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్లు అందిస్తున్నామని, వాతావరణ ఆధారిత, పీఎం ఫసల్ బీమా యోజనలపై అవగాహన కల్పించి అర్హులైన ప్రతి రైతు పంటల బీమాలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 86 వేల ఎకరాల్లో 1.26 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు ‘రైతు సంపద’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తూ మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరుస్తున్న జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. జలధార–జలహారతి పథకం కింద జిల్లాలో 1,939 పనులు పూర్తి చేశామని తెలిపారు. 3,189 ఫామ్ పాండ్లను అభివృద్ధి చేయడంతో పాటు భూగర్భ జలాల అభివృద్ధికి పైలట్ ప్రాతిపదికన రీచార్జ్ షాఫ్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందుకోసం రూ.107 కోట్లతో భూగర్భ జలాల పునరుద్ధరణను బలోపేతం చేయడంతో పాటు దీర్ఘకాలిక నీటి భద్రతకు చర్యలు చేపట్టామన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.19.74 కోట్లతో 378 ఓఅండ్‌ఎం పనులు చేపట్టామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన–1.0 పథకంలో 82,443 గృహాలను రూ.1,504.21 కోట్ల ప్రాజెక్టు విలువతో మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 46,962 గృహాలు పూర్తికాగా, 35,481 గృహాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా 12,774 గృహాలకు 41.33 మెగావాట్ల సౌర ఫలకాలను రూ.78.68 కోట్ల సబ్సిడీతో ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. జిల్లాలోని 27,053 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ అందించామని చెప్పారు. ఎన్నో దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల పీవీటీజీ గిరిజన గ్రామాలైన మోదెల, బండారుగూడెం, చీపురుగూడెంలలో పీఎం–జన్‌మన్ పథకం ద్వారా రూ.77.50 కోట్లతో సౌర మినీ గ్రిడ్లు ఏర్పాటు చేసి 108 గిరిజన కుటుంబాలకు సౌర విద్యుత్ వెలుగులు అందించామని తెలిపారు.

తల్లికి వందనం పథకం కింద ఇప్పటివరకు 2,40,921 మంది విద్యార్థులకు రూ.361.38 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని మంత్రి వెల్లడించారు. వీబీ–జీ రామ్ జీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 1.08 కోట్ల ఉపాధి పనిదినాలు కల్పించి రూ.324 కోట్లను వేతనాలుగా అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఏలూరు జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న, కలిగి ఉన్న వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ జైలుకు పంపిస్తున్నామని తెలిపారు.

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేస్తున్నామని చెప్పారు. మన మిత్ర యాప్ ద్వారా జిల్లాలో 1,156 సేవలపై ఇప్పటివరకు 1,29,600 మందికి అవగాహన కల్పించి, 2,16,916 పౌర సేవలను అందించామని మంత్రి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి, డీఆర్వో ఎం. శ్రీదేవి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, ఏపీ వడ్డిలు కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.