హైదరాబాద్: మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనేదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ.. “మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారు. రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకొచ్చాం. ఆడబిడ్డలకు రూ.500కే సిలిండర్ అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. ఈ నెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చాలి. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకొని పలువురు దేశం విడిచి పారిపోతున్నారు. మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారు” అని రేవంత్ రెడ్డి తెలిపారు.