ఆస్తి పన్ను వసూళ్లలో రెండవ సారి ప్రథమ స్థానం…

ఆస్తి పన్ను వసూళ్లలో రెండవ సారి ప్రథమ స్థానం…
- రెవిన్యూ విభాగాన్ని అభినందించిన కమీషనర్
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూళ్ల లో రెండవ సారి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకు కమీషనర్ గంగిరెడ్డి బుధవారం రెవిన్యూ విభాగం అధికారి అస్లాం సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్వో అస్లాం మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల రెండవసారి ప్రథమ స్థానంలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇది పూర్తిగా తమ సిబ్బంది, స్వర్ణ వార్డు ఉద్యోగుల సమిష్టి సహకార అన్నారు. పురపాలక సంఘం మొత్తం డిమాండ్ రూ. 9 కోట్ల 50 లక్షలు కాగా ఇందులో ప్రభుత్వ భవనాల బకాయిలు రూ. 2 కోట్లు వెరసి నికరంగా రూ. 7 కోట్ల 50 లక్షలు. వసూలు అయిన మొత్తం రూ. 6 కోట్ల 27 లక్షలు వసూలు చేసి ప్రథమ స్థానంలో నిలచిందన్నారు.
ఇక నీటి పన్ను వసూలు విషయంలో కూడా మొత్తం రూ. 4 కోట్లు డిమాండ్ ఉండగా రూ. 2 కోట్లు వసూలు చేశామన్నారు. తక్కిన సొమ్ము సైతం వసూలుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు సహకరించిన ప్రజలకు, సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపారు.
