దేశంలోనే తొలి గ్రీన్ సిమెంట్ విప్లవం.. కడపలో రూ.3,100 కోట్ల దాల్మియా విస్తరణకు శ్రీకారం

దేశంలోనే తొలి గ్రీన్ సిమెంట్ విప్లవం.. కడపలో రూ.3,100 కోట్ల దాల్మియా విస్తరణకు శ్రీకారం

  • రూ.3,100 కోట్లతో దాల్మియా రెండో దశ విస్తరణ
  • నేడు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన
  • గ్రీన్ సిమెంట్‌తో కార్బన్ ఉద్గారాల తగ్గింపే లక్ష్యం
  • 700 మందికి కొత్త ఉద్యోగాలు.. రాష్ట్ర ఆదాయానికి భారీ ఊతం
  • పర్యావరణహిత సాంకేతికతతో కడపకు జాతీయ గుర్తింపు

కడప, ఆంధ్రప్రభ బ్యూరో: రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి కడప జిల్లా వేదిక కానుంది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలోని దాల్మియా భారత్ సిమెంట్ పరిశ్రమ రెండో దశ విస్తరణ పనులకు బుధవారం రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు.

రూ.3,100 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా అత్యాధునిక గ్రీన్ సిమెంట్ తయారీ సాంకేతికతను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి నారా లోకేష్ మంగళవారం ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచింది. పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ సిమెంట్ తయారీకి కడప కేంద్రంగా మారబోతోందన్న సంకేతాలను ఆయన ఇచ్చారు.

ప్రస్తుతం దాల్మియా ప్లాంట్‌లో ఏటా 2.5 మిలియన్ క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతోంది. విస్తరణ అనంతరం క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులకు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు పెరగనుంది. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉపాధి లభిస్తుండగా, కొత్త విస్తరణతో మరో 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో మొత్తం ఉపాధి అవకాశాలు 1,650కు చేరనున్నాయి.

గ్రీన్ సిమెంట్ తయారీలో తక్కువ క్లింకర్ వినియోగంతో పాటు ఫ్లై యాష్, జీజీబీఎస్ వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులను వినియోగించడం వల్ల సాధారణ సిమెంట్‌తో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సాంకేతికత వల్ల శక్తి వినియోగం తగ్గడంతో పాటు, సహజ వనరుల పరిరక్షణ, పారిశ్రామిక వ్యర్థాల పునర్వినియోగం కూడా పెరుగుతుంది.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌లో 80 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వినియోగించనున్నారు. ప్రాజెక్టు విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, పరిశ్రమలో వినియోగించిన నీటిని పూర్తిగా తిరిగి ఉపయోగించే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థ, రూ.100 కోట్లతో 130 అధిక సామర్థ్య బ్యాగ్ ఫిల్టర్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం దాల్మియా సంస్థ పన్నులు, మైనింగ్ రాయల్టీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.102 కోట్లు చెల్లిస్తుండగా, విస్తరణ పూర్తయిన తర్వాత అది రూ.325 కోట్లకు పెరగనుంది. ఈ ప్రాజెక్టుతో కడప జిల్లా దేశంలో పర్యావరణహిత సిమెంట్ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందడంతో పాటు, రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.