ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలకు పెద్దపీట
ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలకు పెద్దపీట
- పెరుగుతున్న వరి సాగు.. ధాన్యం నిల్వలతో ప్రభుత్వానికి సవాల్
- ఆరుతడి పంటలకు ఎకరానికి రూ.8 వేల ప్రోత్సాహకం
- మార్కెట్ భరోసాతో పంటల వైవిధ్యీకరణకు సర్కార్ ప్రణాళిక
- హైడ్రా తరహాలో సాగు సంస్కరణలపై సీఎం రేవంత్ ఫోకస్
ఆంధ్రప్రభ న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి, హైదరాబాద్: సిరుల మాగాణిగా పేరొందిన తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగుతో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. సంప్రదాయ వరి సాగుతో నిండా మునుగుతున్న రైతన్నలను ఆదుకోవడంతో పాటు, ప్రత్యామ్నాయ వాణిజ్య, ఆరుతడి పంటలవైపు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెరిగిపోయిన వరి ధాన్యం నిల్వలతో మరోసారి వరి సాగు ద్వారా తలెత్తే సమస్యలను సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, గతంలో అనేక ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో దానిని సవాల్గా స్వీకరించిన ముఖ్యమంత్రి, కరువు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలపై సమగ్ర నివేదికను అధికారుల నుంచి తెప్పించి, అన్నదాతలకు ప్రత్యామ్నాయం చూపేందుకు సిద్ధమైంది.
ఈ ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలకు పెద్దపీట
కంది, సోయాబీన్, పెసర, మినుము, జొన్న, సజ్జ సాగుకు ప్రోత్సాహం. ఎకరానికి రూ.8 వేల నజరానా ఇచ్చేలా ఆలోచన. కేబినెట్లోనూ సంప్రదాయ వరి సాగుపై చర్చ. పేరుకుపోయిన వరి ధాన్యం నిల్వలతో తలనొప్పులు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఊతమిచ్చేలా చర్యలు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ భరోసా దిశగా చొరవ.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసులో మాటను ఆయన సన్నిహితులు ఆంధ్రప్రభతో పంచుకున్నారు. వారు తెలియజేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఖరీఫ్‌లో వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారు.
పెరుగుతున్న వరి సాగు
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరుగుతోంది. సామాజిక ఆర్థిక నివేదిక ప్రకారం 2023-24లో 118.09 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, 2024-25లో 127.03 లక్షల ఎకరాలకు చేరింది. 2025-26లో 132.01 లక్షల ఎకరాలకు చేరినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. అంటే మూడేళ్ల వ్యవధిలోనే దాదాపు 14 లక్షల ఎకరాల్లో అదనంగా వరి విస్తరించింది. 2016-17లో సుమారు 41.6 లక్షల ఎకరాల్లో ఉన్న వరిసాగు, గత ఎనిమిదేళ్ల వ్యవధిలో దాదాపు మూడురెట్లు పెరగడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది.
రికార్డు స్థాయిలో వరి దిగుబడి
కేంద్ర వ్యవసాయ శాఖ 2023-24 అంచనాల ప్రకారం తెలంగాణలో 168.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి నమోదైంది. దేశవ్యాప్తంగా 1,378.25 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో తెలంగాణ వాటా 12.5 శాతంగా నిలిచింది. ఆ ఏడాది దేశంలోనే అత్యధిక బియ్యం ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇక 2025-26 ఖరీఫ్‌లోనే 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా సుమారు 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనాలు చెబుతున్నాయి.
సర్కారును కలవరపెడుతున్న ధాన్యం నిల్వలు
భారీగా పెరిగిన వరి సాగుతో ప్రతి సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారుతోంది. 2025-26 రబీలో 54.48 లక్షల ఎకరాల్లో వరి సాగుతో 1.52 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ కార్యాచరణ రూపొందించింది.
భారీ కొనుగోళ్లకు గన్నీ సంచులు, రవాణా, మిల్లింగ్, గోదాముల సామర్థ్యం వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. వరి విస్తీర్ణం ఇదే స్థాయిలో పెరుగుతూ పోతే భవిష్యత్తులో ధాన్యం నిల్వలు ప్రభుత్వానికి మరింత భారంగా మారే ప్రమాదం ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
వరి పంటపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐదేళ్ల పంటల వైవిధ్యీకరణ ప్రణాళికను ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. దశలవారీగా 25 లక్షల ఎకరాల వరి విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలన్నది వారి ప్రతిపాదన. తొలి ఏడాదిలో ఎంపిక చేసిన జిల్లాల్లో 5 నుంచి 10 లక్షల ఎకరాల్లో పంట మార్పిడిని చేపట్టి, ఐదో ఏడాది నాటికి 25 లక్షల ఎకరాలకు విస్తరించాలని సూచించినట్లు తెలుస్తోంది. కంది, సోయాబీన్, పెసర, మినుము, జొన్న, సజ్జ, శనగ వంటి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించింది.
రైతుకు రూ.8 వేల భరోసా
వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలకు మళ్లే రైతులకు ఆదాయ నష్టం లేకుండా చూడాలన్నది ప్రభుత్వ ముందున్న ప్రధాన సవాల్. ఈ నేపథ్యంలో నిర్దేశిత ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున నేరుగా ఆర్థిక ప్రోత్సాహకం అందించాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు సమాచారం.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, స్వయం సహాయక సంఘాల ద్వారా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. అయితే వరికి కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మార్కెటింగ్ భరోసా ఉండటంతో రైతులు ఆ పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్, గిట్టుబాటు ధరపై స్పష్టమైన భరోసా లేకపోవడమే పంట మార్పిడికి ప్రధాన అడ్డంకిగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఈసారి పంట మార్పిడితో పాటు కొనుగోలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను సమాంతరంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం ఉక్కు సంకల్పం
గత ప్రభుత్వాలు సాధించలేని పంటల వైవిధ్యీకరణను సవాల్‌గా స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. కరువు పరిస్థితులు, వర్షపాతంలో హెచ్చుతగ్గులు, భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి, వరి ధాన్యం నిల్వలు వంటి అంశాలపై అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తెప్పించినట్లు తెలుస్తోంది.
రైతుకు నష్టం కలగకుండా, ఆదాయం తగ్గకుండా, పండించిన పంటకు మార్కెట్ భరోసా కల్పిస్తూ ప్రత్యామ్నాయ సాగు విధానాన్ని అమలు చేయాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఖరీఫ్ నుంచే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పంట మార్పిడికి శ్రీకారం చుట్టి, ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎం పట్టుదలకు హైడ్రానే తార్కాణం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటే సాధించేందుకు ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతారన్న పేరును సంపాదించుకున్నారు. ఇప్పటికే అనేక విమర్శల నుంచి ప్రశంసలు అందుకునేలా హైడ్రాను ముందుకు నడిపించిన ఆయన, అంతే కృతనిశ్చయంతో పంటల సాగుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని ప్రసాదించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాతో మొదట్లో అనేక విమర్శలు, అలజడి వాతావరణం, కోర్టులు, ఇతర వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఆయన ముక్కుసూటిగా ముందుకు సాగడంతో చెరువులు జీవం పోసుకుంటుండగా, ఆక్రమణలు తగ్గి, చెరువులకు జలకళ వచ్చి చేరుతోంది. పర్యాటకంగానూ చెరువులను అభివృద్ధి చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. దీంతో పంటల వైవిధ్యాన్ని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని, పూర్తి చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
