ప్రత్యేక సమగ్ర సవరణ యుద్ధం లాంటిది

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
సాంస్కృతిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి బీఎల్‌ఏలు, నాయకులకు జగ్గారెడ్డి, నిర్మల దిశానిర్దేశం

ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ఒక యుద్ధం లాంటిదని, దానిని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెలంగాణ సాంస్కృతిక కార్పొరేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి కార్యకర్త చురుకుగా వ్యవహరించాలని సూచించారు. బీఎల్‌వోలు తమ వద్దకు వచ్చే వరకు ఎదురుచూడకుండా కార్యకర్తలే ముందుగా వెళ్లి ఓటర్లకు సహకరించాలని తెలిపారు.

ఓటు నమోదు కాకపోతే వ్యక్తిగతంగా ఓటరే నష్టపోతాడని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విషయంలో ఆసక్తి, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలరెడ్డి మాట్లాడుతూ, రానున్న ఐదు రోజుల్లోనే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తిచేసేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఇది పార్టీ కార్యక్రమం మాత్రమే కాకుండా సంగారెడ్డి ప్రజల కోసం చేస్తున్న బాధ్యతగా భావించి ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ చైర్‌పర్సన్లు కూన వనిత, అంజమ్మ, నాయకులు కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్, రఘు గౌడ్, జార్జ్ మాథ్యూస్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ గంగేరి శ్రీహరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.