శ్రీకాకుళానికి అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్..

శ్రీకాకుళానికి అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్..
రూ.14 కోట్లతో క్రీడా కాంప్లెక్స్
– ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం, మే 23 (ఆంధ్రప్రభ బ్యూరో):జిల్లా కేంద్రం పరిధిలోని పాతృనివలస సమీపంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసినట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
శనివారం నిర్మాణ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రి Kinjarapu Ram Mohan Naidu, ముఖ్యమంత్రి N. Chandrababu Naidu దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించామని వివరించారు.
ఈ పనులను ఏడాది కాలంలో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీనిని కేవలం స్టేడియానికి మాత్రమే పరిమితం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పూర్తి స్థాయి స్పోర్ట్స్ అకాడమీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఈ కాంప్లెక్స్‌లో ఆధునిక సింథటిక్ కోర్టులు, రెండు స్క్వాష్ కోర్టులు, బ్యాడ్మింటన్, కబడ్డీ మైదానాలతో పాటు అంతర్జాతీయ స్థాయి హాకీ స్టేడియం కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.
క్రీడాకారుల వసతి కోసం డార్మిటరీలు, డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేసి, శాప్ ఆధ్వర్యంలో నిపుణులైన కోచ్‌లతో శిక్షణ అందిస్తామని చెప్పారు. అదనంగా కోడి రామ్మూర్తి స్టేడియం పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
అదేవిధంగా, ఒలింపిక్ పతక విజేత Karnam Malleswari పేరుతో ప్రత్యేక అకాడమీని స్థాపించడంతో పాటు, సమీపంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు.
