9న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం
నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్లో హస్తకళాకారులు, చేనేత కార్మికుల కోసం ఈ నెల 9న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు శిబిరం కన్వీనర్ కలవకొలను నాగ తులసీరావు తెలిపారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ (న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాకినాడకు చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి వైద్య బృందంతో పాటు జైత్ర మీడియా, హైదరాబాద్ (పోలిశెట్టి శ్రీనివాస్) సహకారంతో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నర్సాపురం, మొగల్తూరు మండలాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ శిబిరంలో ఉచిత కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులు అందజేయడంతో పాటు, శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నట్లు నాగ తులసీరావు తెలిపారు.
