Rajamouli | ఫ్రాన్స్‌లో శాశ్వత గుర్తింపు!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రముఖ సినీ సంస్థల్లో ఒకటైన ఫ్రాన్స్‌కు చెందిన సినెమాథెక్ ఫ్రాన్సైస్ ( Cinémathèque Française) ఆయనకు ప్రత్యేక సత్కరించింది. ఈ సందర్భంగా ఆ సంస్థలోని హెన్రీ లాంగ్లొయిస్ పేరుతో ఉన్న గౌరవ విభాగంలో రాజమౌళికి శాశ్వత గుర్తింపు కల్పించింది.

ఈ సందర్భంగా రాజమౌళి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమాల ద్వారా గుర్తింపు పొందడమే తనకు గొప్ప గౌరవమని, అయితే ఈ సత్కారం మాత్రం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ప్రపంచ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన సంస్థలో తన పేరు శాశ్వతంగా నిలవడం మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు.

ఈ గౌరవాన్ని అందించిన ప్రముఖ దర్శకుడు కోస్టా-గావ్రాస్ కు, అలాగే సినెమాథెక్ ఫ్రాన్సైస్ నిర్వాహకులకు రాజమౌళి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ సినిమాను వారు ఆదరిస్తున్న తీరు పట్ల ఆయన సంతోసం వ్యక్తం చేశారు.

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరోస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి ఈ గుర్తింపు రావడం తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.