​దేశ పునర్వైభవానికి యువతే కీలకం..

  • నల్లగొండ విభాగ్ సహ ప్రచారక్ మెంత మధు.. ​
  • ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ‘యువ సాంఘిక్’..
  • ​దేశభక్తులుగా యువతను తీర్చిదిద్దడమే సంఘ్ లక్ష్యం..
  • ​పెద్ద ఎత్తున పాల్గొన్న చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల యువత

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని తిరిగి పునర్ వైభవ స్థితికి తీసుకురావడంలో యువతదే కీలక పాత్ర అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నల్లగొండ విభాగ్ సహ ప్రచారక్ మెంత మధుజీ అన్నారు. చౌటుప్పల్ ఖండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “యువ సాంఘిక్” కార్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా విచ్చేసి ప్రసంగించారు.​

ఈ సందర్భంగా మధుజీ మాట్లాడుతూ.. యువతను క్రమశిక్షణ కలిగిన దేశభక్తులుగా తీర్చిదిద్దడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. నేటి యువత దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

చౌటుప్పల్ ఖండ్ కార్యవాహ బడుగు శ్రీరాములు సారథ్యంలో జరిగిన ఈ యువ సాంఘిక్ ఉత్సవంలో చౌటుప్పల్ పట్టణంతో పాటు సంస్థాన్ నారాయణపూర్ మండలాల నుండి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్రమశిక్షణతో కూడిన శారీరిక్ ప్రదర్శనలు, సంఘ్ ప్రార్థన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రముఖులు, దేశభక్తులు ఏలే సుభాష్ చంద్రబోస్, మాతంగి రేణు కుమార్, మోదుగ కమలాకర్ రెడ్డి, కర్నాటి శ్రీనివాసులు, చిట్యాల నరేష్, పోలోజు శ్రీనివాస్ చారి, డాక్టర్ వేముల నరసింహ, కర్నాటి శ్యాంప్రసాద్, ఏ. మహిపాల్ రెడ్డి, బోయ ధర్మసాయి, బి. సాయి కిరణ్, బాతరాజు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.