ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
సంక్షేమ పథకాలతో నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నాగర్‌కర్నూల్, (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర గురువారం కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల బస్సు యాత్రలో భాగంగా బృందం తిమ్మాజిపేటకు చేరుకుంది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడమే ఈ బస్సు యాత్ర ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చినది పదవుల కోసం కాదని, ప్రజా శ్రేయస్సు కోసమేనని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, అందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా, సన్న వడ్లకు బోనస్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 550 పడకల ఆసుపత్రి ఏర్పాటు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.
