కృష్ణా ఘాట్ల వద్ద భద్రత పెంచాలి
- ముగ్గురు చిన్నారుల మృతి బాధాకరం..
- ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
కృష్ణలంక, ఆంధ్రప్రభ : విజయవాడ కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్ వద్ద కృష్ణానదిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణలంక ఇంద్రకాలనీకి చెందిన తిగుళ్ల తేజ, గడ్డం జాషువా, వీసాం గౌతమ్ కృష్ణానదిలో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాల బాధ వర్ణనాతీతమని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు జరిగిన ఈ విషాదాన్ని మాటల్లో వ్యక్తం చేయలేమన్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు
కృష్ణానది ఘాట్ల వద్ద ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నదీ తీరంలోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ స్పష్టమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, నదిలోకి ఎవరూ ప్రమాదకర ప్రాంతాల్లో వెళ్లకుండా పర్యవేక్షణ పెంచాలని కోరారు. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు.
