ఘనంగా జల దినోత్సవ కార్యక్రమం
పరిశుభ్రమైన తాగునీటి ప్రాధాన్యంపై అవగాహన..
నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు జల వనరులను కాపాడాలని సూచన
నడిగూడెం, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మండలంలోని వల్లాపురం గ్రామంలో హర్ ఘర్ జల్ ఆప్రాన్ దివస్ (జల దినోత్సవం) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కేశగాని సరిత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సతీష్, సిబ్బంది గ్రామస్థులకు తాగునీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బోర్‌వెల్ నీరు, ఆర్వో నీరు, మిషన్ భగీరథ తాగునీటి మధ్య ఉన్న తేడాలను ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. పరిశుభ్రమైన మిషన్ భగీరథ నీటిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, భవిష్యత్ తరాలకు జల వనరులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కేశగాని సరిత లక్ష్మణ్ మాట్లాడుతూ.. నీటి విలువను ప్రతి ఒక్కరూ గుర్తించి పొదుపుగా వినియోగించాలని కోరారు. నీటిని వృథా చేయకుండా అందుబాటులో ఉన్న నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రణబోతు మల్లారెడ్డి, ఉప సర్పంచ్ కోట చంద్రశేఖర్‌రెడ్డి, వార్డు సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్ మైనంపాటి ఉపేంద్రమ్మ, గ్రామ పెద్దలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
