గ్రామాల్లో వర్గపోరుతో వేడెక్కిన రాజకీయం
నిధుల కొరతతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు బ్రేక్..
ఎన్నికల అనంతరం కొనసాగుతున్న వర్గపోరు
పలుచోట్ల దాడులు, కేసులతో హీటెక్కిన పాలిటిక్స్
వికారాబాద్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా నిలవాల్సిన గ్రామపంచాయతీలు ప్రస్తుతం నిధుల కొరత, రాజకీయ కక్షలు, వర్గ విభేదాలతో సతమతమవుతున్నాయి. గత నవంబర్‌లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరినా.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం ఉండటంతో కేంద్రం నుంచి వచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతోనే పలు పంచాయతీలు పనులు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల సమయంలో ఏర్పడిన రాజకీయ విభేదాలు ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుండటంతో కొన్ని గ్రామాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి కంటే వర్గపోరాటాలే ప్రధానంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
594 పంచాయతీలు.. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు
వికారాబాద్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 594 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచులు ఎన్నికయ్యారు. కొత్త పాలకవర్గాలతో గ్రామాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రజలు ఆశించినప్పటికీ.. కొన్ని గ్రామాల్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న ఘటనలు ఆ ఆశలకు భిన్నమైన పరిస్థితులను చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో కొన్ని చోట్ల ఘర్షణలు, దాడులు, పోలీసు కేసుల వరకు వ్యవహారం వెళ్లింది.
కోట్‌పల్లిలో సర్పంచ్ భర్తపై దాడి
కోట్‌పల్లి మండల కేంద్రంలో సర్పంచ్‌గా ఎన్నికైన జంగం బసమ్మ భర్త జంగం సంఘీపై ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంఘీ హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన రాజకీయ వర్గాలు ఎన్నికల తర్వాత కూడా పరస్పర విభేదాలతో కొనసాగడం వల్లే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నర్సాపూర్‌లోనూ వర్గ విభేదాలు
దారూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బిళ్ల రాజుపై ప్రత్యర్థి వర్గం దాడికి ప్రయత్నించిందని ఆయన వర్గీయులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం.
ఈ వివాదంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకున్న అనంతరం ప్రత్యర్థి వర్గంపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కినట్లు తెలుస్తోంది.
గోల్కొండలో అభివృద్ధి పనులకు ఆటంకాలు?
మామిడిపేట మండలంలోని గోల్కొండ గ్రామంలోనూ సర్పంచ్ వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరైనా ఇప్పటివరకు అందలేదని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇదే గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన కరణం కీర్తి రామకృష్ణ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు గ్రామంలో ప్రజా పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.
అయితే ఈ పరిణామాలను ప్రత్యర్థి వర్గం వ్యతిరేకిస్తోందని, ఇటీవల బోనాల సందర్భంగా కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు దాడికి ప్రయత్నించారని సర్పంచ్ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
నిధుల్లేక పంచాయతీలు.. సమస్యల మధ్య సర్పంచులు
గ్రామపంచాయతీలకు అవసరమైన నిధులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు సర్పంచులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గాలపై ఉంది.
అయితే ఒకవైపు నిధుల కొరత.. మరోవైపు రాజకీయ వర్గ విభేదాలు.. ఇంకోవైపు పోలీసు కేసులు, ఘర్షణలతో కొన్ని గ్రామాల్లో పాలనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామపంచాయతీలు రాజకీయ కక్షలకు వేదికలు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పన, గ్రామాల అభివృద్ధికి కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పంచాయతీలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయడంతో పాటు, గ్రామాల్లో నెలకొన్న వర్గ విభేదాలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
