పెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు
జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి ఆహ్వానించి..
ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్టు చేయడంపై మండల అధ్యక్షుడు విష్ణు ఆగ్రహం
బిచ్కుంద, ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రికలు అందించి, అదే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని బీజేపీ బిచ్కుంద మండల అధ్యక్షుడు శెట్టిపల్లి విష్ణు విమర్శించారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ చర్యను నిరసిస్తూ విష్ణు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పార్టీలకు అతీతంగా తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని బీజేపీ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందించారని తెలిపారు.

ఆహ్వానం ఇచ్చిన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం, ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. శుభకార్యానికి హాజరయ్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అడ్డుకునే ఉద్దేశం తమకు లేదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. తమపై అనుమానం ఉన్నప్పుడు బీజేపీ నాయకులకు వివాహ ఆహ్వాన పత్రికలు ఎందుకు ఇచ్చారని ఎమ్మెల్యేను విష్ణు ప్రశ్నించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత, కుటుంబ శుభకార్యాలకు ఆపాదించడం సరికాదన్నారు. ఈ ముందస్తు అరెస్టుల సందర్భంగా బీజేపీ నాయకులు గంగరాజు, కమ్మరి గంగాధర్, ధనూర్ విఠల్, రాజు తదితరులు ఉన్నారు.
