నేడు పస్రాలో పోచమ్మతల్లి బోనాల పండుగ

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలకు ఏర్పాట్లు..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో సౌకర్యాల కల్పన

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : పస్రా గ్రామంలో శ్రీ పోచమ్మతల్లి బోనాల పండుగను ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. పండుగను పురస్కరించుకుని పోచమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోనాల పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర ఏర్పాట్లను గ్రామ సర్పంచ్‌ భూక్య సుమలత, ఉప సర్పంచ్‌ సప్పిడి సంజన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.