ప్రొ.జయశంకర్ బడిబాట విజయవంతం
ప్రొ.జయశంకర్ బడిబాట విజయవంతం
ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లల గుర్తింపు
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఆంగ్ల ఉపాధ్యాయుడు భూక్య వీరన్న తెలిపారు. పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, విద్యా ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, విద్యార్థుల పేర్ల నమోదు చేపడుతున్నట్లు చెప్పారు. ఇంటింటికీ వెళ్లి బడి ఈడు పిల్లలను గుర్తిస్తున్నట్లు వివరించారు.
మండల విద్యాధికారి కొమరం శాంతారావు ఆదేశాల మేరకు జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఉదయాన్నే వీధి వీధికి వెళ్లి సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం, ఇతర మౌలిక సదుపాయాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ఆళ్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఎండలను సైతం లెక్కచేయకుండా పిల్లల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీరన్న తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి, వారిని తిరిగి చదువులోకి తీసుకురావడానికి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెంచుకునేలా క్రీడా ఉపకరణాలు సమకూర్చి, ఆటపాటలతో పాటు విద్యపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం, విచక్షణ జ్ఞానం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అలుపెరగకుండా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు భూక్య వీరన్న, జీపీఎస్ మైలారం ఉపాధ్యాయుడు కుమార్ రాజా, చింతోల్లగుంపు ఉపాధ్యాయుడు భూక్య రమేష్, తీగలంచ ఉపాధ్యాయుడు రవి, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
