నిర్మాణం పూర్తికాకముందే కృంగిన కల్వర్టు..

  • అవకతవకాలపై ముందే హెచ్చరికలు..
  • అయినా పట్టించుకోని అధికారులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ సమీపంలోని నక్కమరి వాగుపై నిర్మిస్తున్న కల్వర్టు నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణంలో భారీ అవకతవకలు, నాణ్యత లోపాలు ఉన్నాయని 2026 ఏప్రిల్ 17న ఆంధ్రప్రభ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. అదే రోజు సంబంధిత ఆర్‌అండ్‌బీ డీఈ జలంధర్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారుల వైఫల్యం కారణంగా నాణ్యతలేని ఇసుకతో కల్వర్టు నిర్మాణం చేపట్టారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఫలితంగా నిర్మాణం పూర్తికాకముందే కల్వర్టులో కొన్ని భాగాలు భారీగా కృంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ కల్వర్టే ప్రధాన రాకపోకల మార్గం కావడంతో ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కల్వర్టు బలహీనంగా మారి ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు బాధ్యత ఎవరు వహిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై సంబంధిత అధికారి జలంధర్‌రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. నిర్మాణం ప్రారంభ దశలోనే నాణ్యత లోపాలపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కల్వర్టును పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరంగా మారిన ఈ నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పరిసర గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.