ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం
- మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక
- ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
- అందే రోజు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేత
- జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలకు ఫొటోగ్రాఫర్ల నుంచి విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. పోటీలకు మొత్తం 221 ఛాయాచిత్రాలు ఎంట్రీలలో పంపగా , వాటిలో మూడు కేటగిరీలకు సంబంధించిన 27 ఉత్తమ ఛాయాచిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ కాంపౌండ్‌లోని జిల్లా సమాచార శాఖ కార్యాలయంలో సోమవారం ప్రదర్శించిన ఛాయాచిత్రాలను కేటగిరీల వారీగా పరిశీలించిన జ్యూరీ సభ్యులు ప్రతిభ, సృజనాత్మకత, అంశ ప్రాధాన్యత, ఛాయాచిత్ర నాణ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని 27 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపిక చేశారని తెలిపారు.
ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక ప్రక్రియలో ఫొటోగ్రఫీ రంగానికి చెందిన అనుభవజ్ఞులు, అధికారులు జ్యూరీ సభ్యులైన ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్ టి.శ్రీనివాస రెడ్డి ,ఎఫ్ ఆర్ పి ఎస్ ది హిందూ రిటైర్డ్ ఫొటో జర్నలిస్ట్ సి.హెచ్.వి.ఎస్. విజయభాస్కర రావు, విజయవాడ స్టూడియో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రవికుమార్, సీనియర్ ఫొటోగ్రాఫర్ ఎస్.రామారావు (ఫ్లాష్ రామారావు), డీపీఆర్‌ఓ టి.నాగేశ్వరరావు, వీఎంసీ పీఆర్వో డాక్టర్ రజియా షభీనాలు కేటగిరీల వారీగా పరిశీలించి 27 ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసినట్లు జిల్లాలో ఫొటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎంపికైన ఉత్తమ ఛాయాచిత్రాలకు సంబంధించిన నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని ఫొటోగ్రాఫర్లను సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఛాయాచిత్రాల ఎంపిక నిర్వహణ కార్యక్రమం లో డిఐపిఆర్ఓ కె.వి.రమణరావు, డివిజనల్ పిఆర్ఓ కె.రవి, రిటైర్డ్ ఏవి సూపర్వైజట్ వివి ప్రసాద్, ఏ.వి సూపర్వైజర్ బి.బాలాజీ, సిబ్బంది పాల్గొన్నారు.

