సింగరేణి ఆధ్వర్యంలో సామాజిక చైతన్య నాటకోత్సవాలు..
- మహనీయుల ఆశయాలపై 14 నుంచి 16 వరకు నాటక ప్రదర్శనలు..
- విజయవంతం చేయాలని జీఎం పిలుపు…
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలు, మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సింగరేణి ఆధ్వర్యంలో మూడు రోజుల సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటలకు భూపాలపల్లి కృష్ణకాలనీలోని సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు.
14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితం, ఆశయాలపై ‘శరణం శరణం గచ్ఛామి’, 15న జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేల సామాజిక పోరాటంపై ‘సత్యశోధన’, 16న అంబేద్కర్ ఆలోచనా ప్రస్థానం, బౌద్ధ తత్వం వైపు ఆయన ప్రయాణాన్ని ప్రతిబింబించే ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటకాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.మహనీయుల జీవితాలు, సామాజిక ఉద్యమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, మానవతా విలువలపై చైతన్యం కల్పించడమే కార్యక్రమాల ఉద్దేశమన్నారు. కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నాటకోత్సవాలను విజయవంతం చేయాలని జీఎం కోరారు.
