దత్తక్షేత్రంలో హీరో శ్రీకాంత్ సందడి..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల వద్ద పవిత్ర కృష్ణా నది ఒడ్డున వెలసిన శ్రీ దత్త క్షేత్రాల్లో ప్రముఖ హీరో శ్రీకాంత్ సందడి చేశారు. హీరో శ్రీకాంత్ పవిత్ర శ్రావణమాసం ప్రారంభం సందర్భంగా గురువారం రోజు దత్త క్షేత్రానికి మిత్రులతో కలిసి వచ్చారు.

పసుపుల గ్రామం వద్ద వెలసిన శ్రీ క్షేత్ర శ్రీ వల్లభపురం దత్త క్షేత్రం వద్ద ప్రవహిస్తున్న కృష్ణానది నది ఆవలి ఒడ్డున ఉన్న కురువపురం దత్తక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు స్వామివారి దర్శనం అనంతరం తిరిగి స్టీమర్ లో శ్రీపాద శ్రీ వల్లభాపురం దత్తక్షేత్రంలోనూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు.

ఈ సందర్భంగా పలువురు అభిమానులు హీరో శ్రీకాంత్ ను చూడగానే కేరింతలు కొడుతూ ఆయనతో కరాచాలనం చేసి ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తన వద్దకు రావడంతో ఏమాత్రం విసుక్కోకుండా ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. శ్రావణమాసం సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

గతంలోనూ హీరో శ్రీకాంత్ కురువపురం వల్లభాపురం దత్తక్షేత్రాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దత్తాత్రేయ స్వామి స్వయంగా నడయాడి తపమాచరించిన ఈ ప్రాంతం ఎంతో మహిమాన్వితమైనదని తరచుగా ఇక్కడికి వచ్చి దత్త క్షేత్రాన్ని దర్శించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ కు దత్తక్షేత్రం నిర్వాహకులు స్వామివారి దర్శనం చేయించి శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.