ఆంధ్రప్రదేశ్ ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం

  • కుంకీ ఏనుగుల రాకతో అద్భుత ఫలితాలు
  • ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ లక్ష్యం
  • ప్రపంచ ఏనుగుల దినోత్సవ సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ లేకుండా సహజీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచిక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, కుంకీ ఏనుగుల వినియోగంతో రాష్ట్రంలో మానవ–ఏనుగుల ఘర్షణలను గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అటవీ, పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం మానవ–ఏనుగు సంఘర్షణలను తగ్గించడం పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మదపుటేనుగుల సమస్యను అధిగమించేందుకు కర్ణాటక రాష్ట్ర సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు. వాటి సహకారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయని, ఇప్పటివరకు 15 కీలక కార్యకలాపాల్లో కుంకీ ఏనుగులు సహకరించాయని వెల్లడించారు.

దీనివల్ల అటవీ సరిహద్దు ప్రాంతాల్లో మానవ మరణాలు 70 శాతం వరకు తగ్గాయని, పంటనష్టం కూడా గణనీయంగా తగ్గిందన్నారు. దేశంలో ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, 2014 నుంచి ఏనుగుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందన్నారు. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’, కారిడార్ల రక్షణ, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు ఏనుగుల పరిరక్షణకు దోహదపడుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 150 ఏనుగు కారిడార్లను గుర్తించడం ద్వారా వాటి సహజ ఆవాసాల పరిరక్షణకు బలం చేకూరిందన్నారు.

కుంకీ ఏనుగుల ఏర్పాటులో సహకరించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అప్పటి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనమే కాకుండా, ప్రజలు, ప్రకృతి–వన్యప్రాణుల పరిరక్షణకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇప్పటికే శిక్షణ పొందిన ‘జయంత్’ అనే కుంకీ ఏనుగు పార్వతీపురం మన్యం జిల్లాలో సేవలందిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

హనుమాన్ ప్రాజెక్టుతో విశేష ఫలితాలు..

మానవ–వన్యప్రాణుల సంఘర్షణలను సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2026 మార్చిలో ‘హనుమాన్’ (H.A.N.U.M.A.N.) ప్రాజెక్టును ప్రారంభించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. వేగవంతమైన స్పందన, సాంకేతిక పరిజ్ఞానం, నష్టం నివారణ చర్యల సమన్వయంతో ఈ ప్రాజెక్టు అమలవుతోందన్నారు. ప్రాజెక్టు కింద 93 స్పందన వాహనాలు, 7 వన్యప్రాణి అంబులెన్సులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు 200కు పైగా వన్యప్రాణులను రక్షించడంతో పాటు 30కు పైగా జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, సమాజం కూడా భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు భయంలేకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రజలు, వన్యప్రాణులు సురక్షితంగా సహజీవనం చేసే భవిష్యత్తు నిర్మాణమే అసలైన విజయమని అన్నారు.

“ప్రాజెక్ట్ ఎలిఫెంట్ – 30 జెయింట్ స్టెప్స్” పుస్తకావిష్కరణ

అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా అటవీ శాఖ రూపొందించిన “ప్రాజెక్ట్ ఎలిఫెంట్ – 30 జెయింట్ స్టెప్స్” పుస్తకాన్ని కేంద్ర సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఏనుగుల సంరక్షణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక, వన్యప్రాణి శాస్త్రానికి సంబంధించిన పలు గ్రంథాలను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ కలంకారీ కళాకారులు రూపొందించిన ప్రత్యేక కళాఖండాన్ని ఆవిష్కరించారు.

దేశవ్యాప్తంగా 21,450 పాఠశాలల్లో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఏనుగుల సంరక్షణలో ప్రాణత్యాగం చేసిన ఒడిశాకు చెందిన అటవీ శాఖ అధికారి జుగల్ నాయక్‌కు “గజ గౌరవ్” అవార్డును ప్రదానం చేశారు. అలాగే ఏనుగుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలు, రక్షణ చర్యల్లో విశేష సేవలందించిన సిబ్బందిని ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.

కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అటవీ శాఖ డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శి సుశీల్ కుమార్ అవస్థి, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, పీసీసీఎఫ్ డాక్టర్ పి.వి. చలపతిరావు, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర–రాష్ట్ర అటవీ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు
.