ఆగస్టు 13 నుంచి 19 వరకు దరఖాస్తులు..

23న అర్హత పరీక్ష
అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉచిత కోచింగ్‌..
నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌రావు పిలుపు

సిద్దిపేట, ఆంధ్ర‌ప్ర‌భ : పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు అండగా ‘కేసీఆర్ ఉచిత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన అర్హులైన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులతో ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరాల ద్వారా పలువురు యువత పోలీసు కానిస్టేబుల్, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని హరీశ్‌రావు గుర్తుచేశారు. చదువుపై ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ ఖరీదైన కోచింగ్‌ ఫీజులు చెల్లించలేని నిరుద్యోగ యువతకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గత పదేళ్లుగా ఉచిత శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ

ఈసారి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత శిక్షణ అందించనున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సంబంధిత రంగాల్లో నిపుణుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందిస్తామని తెలిపారు.

దరఖాస్తులు ఇలా..

కేసీఆర్ ఉచిత కానిస్టేబుల్ కోచింగ్‌కు ఆగస్టు 13 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాన్ని సిద్దిపేట బైపాస్ రోడ్డులోని లైబ్రరీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌గా నిర్ణయించారు. అర్హత పరీక్ష అనంతరం ఎంపికైన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఉచిత కానిస్టేబుల్ కోచింగ్‌ అందించనున్నారు.

యువత సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించాలని హరీశ్‌రావు కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంచి శిక్షణకు దూరమవుతున్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్‌ ఉపయోగపడుతుందని తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు కోసం అందించిన లింక్‌ను ఉపయోగించడంతో పాటు, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా కూడా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని హరీశ్‌రావు తెలిపారు.