స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల
- మంత్రి నారా లోకేష్‌తో వర్సిటీ విశేషాలు పంచుకున్న ఎమ్మెల్యే
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : అమెరికా పర్యటనలో ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటిగా పేరొందిన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదే విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యను అభ్యసించిన నేపథ్యంలో సునీత స్టాన్‌ఫోర్డ్ విశేషాలను ఆయనతో పంచుకున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేంద్రంగా నిలుస్తోందని ఆమె అన్నారు.
మంత్రి నారా లోకేష్ చదివిన విద్యాసంస్థను స్వయంగా సందర్శించడం ఆనందంగా ఉందని సునీత పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రపంచంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఒకటిగా కొనసాగుతోందని, ఇక్కడ ప్రవేశం పొందడం అత్యంత కఠినమైన ప్రక్రియ అని తెలిపారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నారా లోకేష్ విద్యను అభ్యసించడం గర్వకారణమన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న అనేక ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు స్టాన్‌ఫోర్డ్‌తో అనుబంధం కలిగి ఉన్నారని సునీత పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం నుంచి అనేక మంది నోబెల్ బహుమతి గ్రహీతలు వెలుగులోకి రావడం దాని విద్యా ప్రమాణాలకు నిదర్శనమన్నారు. స్టాన్‌ఫోర్డ్‌లో పొందిన విద్య, విజ్ఞానం, అంతర్జాతీయ అనుభవం కారణంగానే నారా లోకేష్ రాష్ట్రంలో ఐటీ, విద్యారంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని సునీత అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు విద్యా వ్యవస్థలో ఆధునిక సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదివిన వ్యక్తి రాష్ట్ర మంత్రిగా సేవలందించడం గర్వకారణమని తెలిపారు.
రాయలసీమలో ప్రపంచస్థాయి వర్సిటీలు రావాలి..
రాయలసీమ ప్రాంతంలో ఉన్నత విద్యకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రపంచస్థాయి ప్రమాణాలతో పనిచేసే ఆధునిక విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో మరిన్ని ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు.
రాయలసీమలోని విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలంటే నూతన తరహా విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ దిశగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని రాయలసీమలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ప్రపంచస్థాయి విద్యాసంస్థలు అందుబాటులోకి వస్తే రాయలసీమ విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు ఈ ప్రాంతం విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు కేంద్రంగా మారుతుందని సునీత ఆకాంక్షించారు.
