కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన

  • ఆగస్టు 18న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

ఏలూరు, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 18న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఆగస్టు 18న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ గురువారం ఆర్ఆర్ పేట సర్వీస్ రిజర్వాయర్ వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభకు యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ. అప్పలరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. వందేళ్లకు పైగా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ నిరంకుశ విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్మిక హక్కులను కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను పరిరక్షించాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, సిబ్బందికి 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, సరెండర్ లీవులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ యూనియన్‌లోని సభ్యులంతా ఐక్యంగా, సంఘటితంగా ఉన్నప్పుడే హక్కులను కాపాడుకోవడంతో పాటు కొత్త హక్కులను సాధించుకోవడం సాధ్యమవుతుందని అన్నారు.

అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనంగా రూ.26 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 18న జరిగే నిరసన కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి. వెంకటేశ్వరరావు, ఎస్. వెంకన్న, డి. అప్పారావు, జి. రవి, సిహెచ్. ఏసు, కే. ఏలియా, కే. రామయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.