జియోట్యాగ్‌తో పావురాల పందేలు

జియోట్యాగ్‌తో పావురాల పందేలు

ఎంవీపీ కాలనీ-విశాఖపట్నం-ఆంధ్రప్రభ : మనం ఇప్పటి వరకు ఎక్కడైనా కోడి పందాలు, ఆన్‌లైన్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్, కారు, బైక్ రేసులు, వీడియో గేములు చూశాం. కానీ ఇప్పుడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో జూదగాళ్లు సరికొత్త పందానికి శ్రీకారం చుట్టారు. పూర్వం రాజ్యాలను పాలించిన రాజులు పావురాలను పెంచేవారు. అలా పెంచిన పావురాలతో ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి లేఖలతో రాయబారం పంపేవారు. ఇందుకోసం వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. మరికొంతమంది తమ ప్రియురాళ్లకు లేఖలు అందించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పందెం రాయుళ్లు పావురాలను జూదంగా మార్చారు. పావురాలతో పందేలు కాస్తున్నారు.

క్రికెట్ బెట్టింగ్, పేకాటతో పాటు పావురాల పందేలకు తెరలేపారు. నగరంలో అనేక చోట్ల ఈ జూదం జరుగుతోంది. గాజువాక, కంచరపాలెం, మద్దిలపాలెం, ఆరిలోవ, మధురవాడ, భీమిలి, ఎంవీపీ కాలనీ, పెదవాల్తేరు, చినవాల్తేరులో ఈ జూదం ఎక్కువగా జరుగుతోంది. పందెం నిర్వాహకులు వేసవిలోనే ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

జియోట్యాగ్‌తో పర్యవేక్షణ

నగరంలో కొంతమంది జూదగాళ్లు ఇదే వృత్తిగా చేసుకొని పావురాలను పెంచుతున్నారు. వాటిని దాదాపు 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి వదులుతారు. ముందుగానే కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వీరి ఆటలు వెలుగుచూడటం లేదు. జియోట్యాగ్ ఏర్పాటు చేసిన పావురాలను పదుల సంఖ్యలో వదులుతారు. అక్కడి నుంచి అవి వెళ్తున్న గమ్యాన్ని జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. 100, 200, 300 కిలోమీటర్ల దూరంలో వాటిని విడిచిపెట్టి ఏది ముందుగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందో దానిని విజేతగా ప్రకటిస్తున్నారు.

దీంతో మిగతా పావురాలకంటే ముందుగా నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్న పావురం యజమానికి భారీ మొత్తంలో నగదు ముట్టజెబుతారు. అయితే పందేనికి ముందుగా పావురాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి కాళ్లకు ట్యాగ్ కట్టి కోడ్ ఇచ్చి వదులుతున్నారు. ఏది ముందుగా చేరుకుంటుందో దానిపై బెట్టింగ్ పెట్టిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తున్నారు.

పౌష్టికాహారం పేరుతో పక్షులపై హింస?

కొంతమంది పక్షుల ప్రేమికులు ఇష్టంతో ఇళ్లల్లో పావురాలు పెంచుకుంటారు. ఈ ముసుగులో నగరంలో మరికొందరు జూదానికి పాల్పడుతున్నారు. పందేలకు వినియోగించే పావురాలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో పావురాలు బలిష్టంగా మారి సులువుగా ప్రయాణం చేస్తాయి. పావురాలను జూదం పేరుతో హింసిస్తుండడం తగదని వన్యప్రాణుల సంరక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతి నగరం అంతటా విస్తరించక ముందే పందెం రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పేకాట, క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, కోడి పందేలపైనే కాకుండా పావురాలతో జూదం ఆడుతున్న జూదగాళ్లపై కూడా పోలీసులు దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply