చేంగల్ యువ పరిశోధకుడు పులి రజనీకాంత్‌కు పీహెచ్‌డీ పట్టా..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు పులి రజనీకాంత్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), వరంగల్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి డాక్టరేట్‌ (పీహెచ్‌డీ) పట్టాను సాధించారు.

ఆయన “Modified Direct Torque and Model Predictive Current Control Schemes for Five-Phase Permanent Magnet Synchronous Motor Drive” అనే అంశంపై పరిశోధన నిర్వహించి ఈ ప్రతిష్ఠాత్మక పట్టాను పొందారు.

పరిశోధన రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రజనీకాంత్, అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఐఈఈఈ (IEEE) జర్నల్స్‌లో రెండు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. అలాగే రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలను సమర్పించి ప్రచురింపజేశారు. అదనంగా, తన పరిశోధన ఫలితాలకు సంబంధించిన రెండు పేటెంట్లను కూడా దాఖలు చేశారు.

ఈ పరిశోధనను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రముఖ అధ్యాపకులు డా. టి. వినయ్ కుమార్ పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేశారు.

డాక్టరేట్‌ పూర్తి చేసిన అనంతరం రజనీకాంత్‌కు ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ నెక్స్టియర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో సిస్టమ్ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఆయన ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తన పరిశోధన విజయానికి మార్గనిర్దేశం చేసిన పరిశోధనా పర్యవేక్షకులు డా. టి. వినయ్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన విద్యా ప్రస్థానంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు పులి గంగాధర్, పులి గంగామణి, సోదరుడు పులి శ్రీకాంత్ అందించిన సహకారం, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

చేంగల్ గ్రామానికి చెందిన యువకుడు డాక్టరేట్‌ పట్టా సాధించి, అనంతరం ప్రముఖ సంస్థలో ఉద్యోగ అవకాశాన్ని పొందడం పట్ల గ్రామస్తులు, బంధుమిత్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘన విజయం చేంగల్ గ్రామానికి, నిజామాబాద్ జిల్లాకు, అలాగే ఆయన కుటుంబానికి గర్వకారణమని పేర్కొంటూ రజనీకాంత్‌కు అభినందనలు తెలిపారు.

Leave a Reply