ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మరోసారి సత్తా చాటింది. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఈ పోరులో.. పంజాబ్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ…. ఫైనల్స్ లో అడుగుపెట్టింది.
ఈ గెలుపుతో ఆర్సీబీ ఇప్పటివరకు నాలుగోసారి ఫైనల్స్‌కి అడుగుపెట్టింది. గతంలో ఆర్సీబీ 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు 9 ఏండ్ల తరువాత 2025లో మరోసారి టైటిల్ ఆశలతో ఫైనల్ బరిలోకి దిగనుంది.
మ్యాచ్ హైలైట్స్:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించి… 101 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ కు దిగిన ఆర్సీబీ… కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించేసింది.
బ్యాటింగ్‌లో మెరుపులు:
బెంగళూరు ఓపెనర్లు ఆరంభం నుంచి విజృంభించారు. ఫిలిప్ సాల్ట్ తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 6 బౌండరీలు, 3 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (12), మయాంక్ అగర్వాల్ (19) తమదైన స్టైల్లో బౌండరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తక్కువ స్కోరు చేసినా జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు.
ఇక ఆఖర్లో కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా సాల్ట్‌కు అద్భుత సహకారం అందించాడు. కేవలం 8 బంతుల్లో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 1 సిక్సర్ ఉన్నాయి. ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్ కలిసి మ్యాచ్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
మ్యాచ్ ప్రారంభంలో బౌలింగ్ పరంగా జట్టు విజయానికి పునాది వేసిన ఆర్సీబీ బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుయాష్ శర్మ, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ చెరో మూడు వికెట్లు తీసి పంజాబ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. యశ్ దయాల్ రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. బ్యాటింగ్ చేసే ముందు ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడం బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఫైనల్స్‌లో ఆసక్తికర పోరు:
ఇప్పుడు ఫైనల్స్‌లో బెంగళూరు జట్టు ఆడనుండటంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. గతంలో మూడు సార్లు టైటిల్‌ను చేజార్చుకున్న ఆర్సీబీ.. ఈసారి ఎలాగైన టైటిల్ ను అందుకోవాలనే కలతో నినాదంతో మైదానంలోకి దిగనుంది.