ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యకు నిదర్శనం – ఎంఈఓ అనురాధ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల గుణాత్మక విద్య, సామర్థ్యాల ఆధారిత బోధన సమర్థవంతంగా అమలవుతోందని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అనురాధ తెలిపారు. నల్లబెల్లి మండలంలోని ఎంపీపీఎస్ రంగాపురం పాఠశాలలో బుధవారం నిర్వహించిన పట్టాభిషేక దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ అనురాధ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, పటిష్టమైన పర్యవేక్షణతో ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో నిర్వహించే పట్టాభిషేక వేడుకలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించడం అభినందనీయం అని,ఇది విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచి, ఉన్నత చదువులకు బాటలు వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పాఠశాల ప్రాంగణం ఆనందోత్సాహాలతో కళకళలాడింది. గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు, మాజీ సర్పంచ్ చీకటి ప్రకాష్ మాట్లాడుతూ, రంగాపురం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.
ఇలాంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బట్టు సాంబయ్య, గ్రామ వార్డు సభ్యులు శ్రీహరి, సతీష్, సిఆర్పి నరసయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడవల్లి రాజిరెడ్డి ఉపాధ్యాయులు స్వరాజ్యం ప్రీ ప్రైమరీ టీచర్స్ చందన, సహారా తదితరులు పాల్గొన్నారు.
