న్యూ ఢిల్లీ – నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తికి ఢిల్లీ కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ సమర్పించిన పత్రాల్లోని లోపాలను సరిదిద్దాలని, కేసుకు సంబంధించి మరింత నిర్ధారణతో కూడిన సరైన పత్రాలను అందించాలని న్యాయస్థానం దర్యాప్తు సంస్థను ఆదేశించింది.
“పూర్తిగా సంతృప్తి చెందే వరకు నేను అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేను” అని న్యాయమూర్తి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ దశలో విచారణను ఆలస్యం చేయవద్దని, నోటీసులు జారీ చేయాలని ఈడీ తరపు న్యాయవాది కోరినప్పటికీ, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఈ మేరకు కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏప్రిల్ 9వ తేదీన చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విదితమే. సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ పరిణామం సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై క్రిమినల్ విచారణ ప్రారంభించే దిశగా ఈడీ వేసిన కీలక అడుగుగా పరిగణిస్తున్నారు.
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చార్జిషీట్‌లో ఐదుగురు వ్యక్తులు, రెండు కంపెనీలను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో గాంధీ కుటుంబానికి నియంత్రణ వాటా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థతో పాటు, గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా భావించే కాంగ్రెస్ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన లావాదేవీలు, నిధుల మళ్లింపును ధృవీకరించే పత్రాలను కూడా ఈడీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.
గత కొన్నేళ్లుగా ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు దివంగత కాంగ్రెస్ కోశాధికారులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లను కూడా ఈడీ గతంలో పలుమార్లు ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలను కూడా ప్రాసిక్యూషన్ ఫిర్యాదులో చేర్చినట్లు భావిస్తున్నారు. తాజాగా కోర్టు ఆదేశాలతో, ఈడీ అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మే 2న జరిగే విచారణలో తదుపరి పరిణామాలు వెల్లడి కానున్నాయి.