NTA Exam Controversy | నీట్ పేపర్ లీక్‌లపై మళ్లీ వివాదం

NTA Exam Controversy | నీట్ పేపర్ లీక్‌లపై మళ్లీ వివాదం

NTA Exam Controversy | ఎన్టీఏ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు
పరీక్షల భద్రతపై ప్రశ్నలు
కోచింగ్ మాఫియా నెట్‌వర్క్ బహిర్గతం
లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో

NTA Exam Controversy | నీట్-యూజీ 2024లో పేపర్ లీక్ అయినప్పుడు 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ సాధించారు. బీహార్‌లో నీట్ పేపర్ లీక్ రాకెట్ పరీక్ష రోజు ఉదయమే బయటపడింది. యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేశారు. ఇందుకు బాధ్యుడిగా డైరెక్టర్ జనరల్‌ను ప్రభుత్వం తొలగించింది. ఇందుకు బాధ్యులెవరో నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చింది. అందులో పలు హామీలను ఇచ్చింది.

రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఎన్టీఏలో సమూలమైన మార్పులను సూచిస్తూ ఒక నివేదిక సమర్పించింది. పార్లమెంట్ ప్రభుత్వ పరీక్షల (అవాంఛనీయ వ్యవహారాల నిరోధక) చట్టాన్ని చేసింది. అక్రమాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త సెక్యూరిటీ ఒప్పందాలను చేసుకుంది. ప్రశ్నపత్రాల రవాణాకు జీపీఎస్-ట్రాక్ వాహనాలను, ఏఐ సహాయంతో పని చేసే కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చేసింది. అభ్యర్థులకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఏర్పాటు చేసింది. అయితే, పేపర్ లీక్‌లను పూర్తిగా అరికట్టలేకపోయింది.

రెండేళ్ల తర్వాత మే 3వ తేదీన నీట్-యూజీ 2026 పరీక్షలను నిర్వహించారు. పైన చెప్పిన సిఫార్సులన్నీ అమలులో ఉన్నాయి. తొమ్మిది రోజుల తర్వాత ఆ ప్రశ్నపత్రాన్ని రద్దు చేశారు. కొందరు విద్యార్థులకు పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో 420 ప్రశ్నల పత్రం వచ్చింది. మరికొందరికి 120 ప్రశ్నలతో కూడిన అసలైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ నెలరోజుల ముందే వచ్చిందని వార్తలు వెలువడ్డాయి. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ 13 మంది అనుమానితులను ప్రశ్నించింది. వీరంతా డెహ్రాడూన్, సికార్, ఝుంఝునూ ప్రాంతాలకు చెందిన వారు. వీరు ఈ పేపర్‌ను రూ.20 వేల నుంచి లక్షల రూపాయలకు విక్రయించినట్టు తేలింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ సంస్థ డైరెక్టర్ జనరల్ ఈ పరీక్షకు రెండు రోజుల ముందు నియమితులయ్యారు. ఈ పరీక్షా విధానాన్ని ప్రశంసించినట్టు ఆయన తాను రాసినట్లు చెప్పబడుతున్న వ్యాఖ్యలను లింక్డ్‌ఇన్ నుంచి తొలగించారు. ఈ పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారోనని 21 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలా పని చేస్తోందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.

ఎన్టీఏ టెస్టింగ్ ఏజెన్సీగా పని చేయాల్సిన సంస్థ. అయితే ఈ ప్రక్రియను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎన్టీఏను 2019లో స్థాపించారు. దేశంలో పరీక్షల విధానం పూర్తిగా ఛిద్రమైనప్పుడు, రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షల్లో పేపర్ లీకులు ఎక్కువగా జరుగుతున్న సమయంలో ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రీకృత విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే ప్రమాణం, సాంకేతికత, జవాబుదారీతనం ఒకే మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయడానికి ఈ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఎన్టీఏ కాంట్రాక్టర్లకు కోఆర్డినేటర్‌గా ఉండటానికి బదులుగా, ప్రశ్నపత్రాల ప్రింటింగ్, ఫిజికల్ పంపిణీ, పరీక్షా కేంద్రాల నిర్వహణ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి అంశాలను అవుట్‌సోర్స్ చేసింది. అవుట్‌సోర్సింగ్‌లో లోపాలు వస్తే మొత్తం వ్యవస్థే దాని ప్రభావానికి గురవుతుంది. 2024లో ఎన్టీఏ 14 ప్రధాన పరీక్షలను నిర్వహించినట్టు 2025లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పేపర్ లీకులు, ప్రశ్నల్లో తప్పులు, ఫలితాల వాయిదా వంటి ఐదు ప్రధాన సమస్యలను ఆ కమిటీ గుర్తించింది. టెస్టింగ్ ఏజెన్సీకి వ్యవస్థీకృత సమస్యలు ఎదురైన సంవత్సరం అది.

రాధాకృష్ణన్ కమిటీ ఈ సమస్యలను గుర్తించింది. వెండర్లపై ఆధారపడటం తగ్గించాలని సూచించింది. రాష్ట్రస్థాయి కోఆర్డినేటర్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. పరీక్షా కేంద్రాలను పోలింగ్ బూత్‌లుగా పరిగణించాలని తెలిపింది. ప్రాథమిక పరిశీలన జరిగినా వాటిని పూర్తిగా అమలు చేయలేదు. ఎన్టీఏకి గడిచిన రెండేళ్లలో ముగ్గురు వేర్వేరు డైరెక్టర్లు వచ్చారు. అయితే, ఇందులోని తప్పులను పూర్తిగా గుర్తించేలోపే వారు తప్పుకున్నారు.

ప్రశ్నపత్రం లీక్ కావడానికి బాధ్యులైన వారికి పదేళ్ల జైలు నిబంధన ఎందుకు పని చేయలేదు? ఇది వ్యవస్థీకృత మాఫియా. దీనికి కోచింగ్ సెంటర్లతో సంబంధాలున్నాయి. పేపర్‌ను సెట్ చేసే వారితోనూ, పంపిణీ నెట్‌వర్క్‌లతోనూ సంబంధాలున్నాయి. ఒక రాష్ట్రంలో కాదు, పలు రాష్ట్రాల నెట్‌వర్క్‌లతో సంబంధాలున్నాయి. రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, గుజరాత్ సహా అనేక రాష్ట్రాల్లో ఈ నెట్‌వర్క్ విస్తరించింది.

2026లో పేపర్ లీక్ కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. 2024లో జరిగిన తప్పులను సరిదిద్దకపోవడం వల్లనే 2026లో కూడా లీక్ చోటుచేసుకుంది. 2024 నాటి లూప్‌హోల్స్‌ను మూసివేయకపోవడం వల్లే ఇది జరిగింది. నీట్ దేశంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి గేట్‌వే వంటిది. విద్యార్థులకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కోచింగ్ సెంటర్లకు, లీక్ అయిన పేపర్‌కు ఐదేసి లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తే విద్యార్థులు భరించలేరు. వారు మరోసారి అంత డబ్బు ఖర్చు చేసి పరీక్ష రాయలేరు.

సీబీఐ దర్యాప్తు చేస్తుంది. అరెస్టులు జరుగుతాయి. కానీ అసలైన బాధ్యులకు శిక్ష పడదు. ప్రభుత్వం మళ్లీ కమిటీ వేస్తుంది. ఎన్టీఏ స్టేట్‌మెంట్ విడుదల చేస్తుంది. తాము పరీక్షల నిర్వహణలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తుంది. 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షల కోసం ఎదురు చూస్తారు. ప్రతిసారి ఇలానే జరుగుతూనే ఉంటుంది.

— న్యూస్ డెస్క్

Leave a Reply