నీట్ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలి
నీట్ అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలి
ఎన్‌టీఏను రద్దు చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్.. కలెక్టరేట్ ఎదుట నిరసన
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : నీట్ ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలు, నిర్వహణా లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని All India Democratic Students Organisation (ఏఐడీఎస్‌ఓ) డిమాండ్ చేసింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ National Testing Agency (ఎన్‌టీఏ)ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మంగళవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి ఈ. మహేష్ మాట్లాడుతూ, నీట్ పరీక్షల నిర్వహణలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవినీతి ఆరోపణలు, పరిపాలనా వైఫల్యాలు పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అన్నారు.
వైద్య విద్యలో ప్రవేశం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి సిద్ధమవుతున్నప్పటికీ, పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాల కారణంగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే Central Board of Secondary Education అమలు చేస్తున్న మూల్యాంకన విధానంలోనూ పలు లోపాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అనూహ్యంగా తక్కువ మార్కులు రావడం, సమాధాన పత్రాల్లో పేజీలు స్పష్టంగా కనిపించకపోవడం, కొన్ని పేజీలు లేకపోవడం వంటి ఘటనలు మూల్యాంకన వ్యవస్థలోని సమస్యలను బహిర్గతం చేస్తున్నాయని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన కీలక పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం, సంబంధిత సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. నీట్, సీబీఎస్‌ఈ వ్యవహారాలపై పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐడీఎస్‌ఓ కేంద్ర సంయుక్త కార్యదర్శి అజయ్ కామత్, రాష్ట్ర అధ్యక్షుడు వి. హరీష్ కుమార్ రెడ్డి, నాయకులు సురేష్, అభిలాష్, మల్లేష్, చరణ్, తేజశ్రీ, ప్రియతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
