ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ లక్ష్యం
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్లుగా ఎదిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సోమవారం ప్రాడెక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్రాంతాల్లో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్లపై ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య పథకం) కింద చేపట్టనున్న పారిశ్రామిక పార్కులు, కెమికల్ పార్కుల అభివృద్ధిపై చర్చించారు. 2026-27లో ఏర్పాటు కానున్న రేర్ ఎర్త్ మినరల్ పార్క్, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్, కంటైనర్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ సహా 175 ఎంఎస్ఎంఈ పార్కులను క్లస్టర్ల వారీగా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షలో ప్రాధాన్యతగా చర్చించారు.
పారిశ్రామిక పార్కుల్లో ప్రాడెక్ట్ పర్ఫెక్షన్‌తో పాటు లాజిస్టిక్స్‌ను కూడా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. నీరు, విద్యుత్, కోల్డ్ చైన్, వేర్‌హౌసింగ్ వంటి మౌలిక సదుపాయాలు ఈ లాజిస్టిక్స్ పార్కులకు అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. ముఖ్యంగా రవాణా వ్యయం తగ్గితే ప్రయోజనం కలుగుతుందని స్పష్టం చేశారు.
పారిశ్రామిక క్లస్టర్లకు రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీ కల్పించేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ద్వారా స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు నాణ్యత పెరిగితేనే గ్లోబల్ స్థాయికి చేరుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో తయారయ్యే ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసి రైతులకు కూడా లాభం చేకూరేలా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయన పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు – మౌలిక సదుపాయాలు – పర్యాటకం అనే విధానంలో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాలు కలుగుతాయని అన్నారు.
‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యక్రమం ద్వారా ఏపీని ఎంఎస్ఎంఈల స్థాపనలో అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయాల్లో హైబ్రిడ్ విధానంలో కోర్సులు అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, అటవీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
