ఓటరు జాబితా సవరణలో చురుగ్గా పాల్గొనాలి

ఓటరు జాబితా సవరణలో చురుగ్గా పాల్గొనాలి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై బీజేపీ అవగాహన సమావేశం

మోత్కూర్, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేడబోయిన యాదగిరి పిలుపునిచ్చారు.

మోత్కూర్ మండలంలోని పాటిమట్ల చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బీఎల్‌ఏ-2లు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. అలాగే, మరణించిన వారి పేర్లు, ద్వంద్వ నమోదులు ఉన్న ఓట్లను గుర్తించి తొలగించే ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఓటరు జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌వో)లకు తెలియజేయవచ్చని వివరించారు. ఒక పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1,200 దాటినట్లయితే, ఓటర్ల సౌకర్యార్థం కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించవచ్చని తెలిపారు.

బీఎల్‌ఓలతో సమన్వయంగా పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితా తయారీనే లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగాలని యాదగిరి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మండల నాయకులు గుదే మధుసూదన్ యాదవ్, రాధారపు మల్లేశం, గుంటి సతీష్, నార్సింగ్ మహేష్, బండ నరసింహ, ఇట్టబోయిన ఆంజనేయులు, నాయిని ఉపేందర్, బత్తిని సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply