Mumbai Dabbawala Crisis | వందేళ్ల ఖ్యాతి.. కరోనా తర్వాత కుదేలైన డబ్బావాలాల వ్యవస్థ

Mumbai Dabbawala Crisis | వందేళ్ల ఖ్యాతి.. కరోనా తర్వాత కుదేలైన డబ్బావాలాల వ్యవస్థ

Mumbai Dabbawala Crisis| శతాబ్ద కాలం సేవలకు కాలం పరీక్ష
హార్వర్డ్‌ను మెప్పించిన డెలివరీ మోడల్
మనుగడ కోసం పోరాటం

Mumbai Dabbawala Crisis| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముంబయి మహానగరం ఇంకా పూర్తిగా నిద్రలేవకముందే.. తెల్లటి టోపీలు, చొక్కాలు ధరించిన పురుషులు సైకిళ్లపై నగరంలోని రైల్వే స్టేషన్ల వైపు పరుగులు తీస్తుంటారు. సైకిళ్లకు వందలాది లంచ్‌బాక్సులు అమర్చుకుని, రైళ్లను సమయానికి అందుకునేందుకు వేగంగా దూసుకెళ్తారు. ఆ లంచ్‌బాక్సులను రైళ్లలో లోడ్ చేసి, నగరంలోని వివిధ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వేడివేడిగా ఇంట్లో వండిన భోజనాన్ని అందిస్తారు. అనంతరం ఖాళీ డబ్బాలను తిరిగి వాటి యజమానుల ఇళ్లకు చేర్చుతారు. వీరినే ‘డబ్బావాలాలు’ అంటారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీరి గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, ముంబయిలో మాత్రం డబ్బావాలాలు ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. శతాబ్దానికి పైగా అత్యంత కచ్చితత్వంతో భోజన డెలివరీ సేవలు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

భారత ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబయిలో ఇంటి భోజనం కుటుంబ జీవితం, సంస్కృతి, ఆహార అలవాట్లతో ముడిపడి ఉంటుంది. అందుకే డబ్బావాలా వ్యవస్థ నగర జీవన విధానంలో కీలక భాగంగా మారింది. ప్రతి లంచ్‌బాక్స్‌పై ప్రత్యేక అక్షర-సంఖ్యల కోడ్ ఉంటుంది. దాని ఆధారంగా ఏ కార్యాలయం, ఏ భవనం, ఏ అంతస్తుకు భోజనం చేరాలనే సమాచారాన్ని గుర్తించి అందజేస్తారు. యాప్‌లు, జీపీఎస్‌ల సహాయం లేకుండానే తరతరాలుగా వచ్చిన అనుభవంతో ఈ వ్యవస్థను నడుపుతున్నారు.

డబ్బావాలాల సేవలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సైతం వీరి వ్యవస్థను తక్కువ ఖర్చుతో అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ మోడల్‌గా అధ్యయనం చేసింది. అంతటి ఖ్యాతిని సంపాదించిన ఈ వ్యవస్థ ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.

1890లో మహాదేవ్ బాచ్చే అనే వ్యక్తి సుమారు 100 మందితో ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించారు. ప్రారంభంలో రంగు దారాలతో లంచ్‌బాక్సులను గుర్తించేవారు. తర్వాత ప్రత్యేక కోడ్ విధానాన్ని అమలు చేశారు. ఒక దశలో సుమారు 4,500 మంది డబ్బావాలాలు రోజుకు 50 వేలకుపైగా లంచ్‌బాక్సులను డెలివరీ చేసేవారు.

అయితే కరోనా మహమ్మారి ఈ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. కార్యాలయాలు మూతపడటంతో డెలివరీలు భారీగా తగ్గిపోయాయి. ఒకప్పుడు రోజుకు 20 నుంచి 25 మంది కస్టమర్లకు సేవలందించిన డబ్బావాలాలు, ఒక్కసారిగా కొద్దిమంది కస్టమర్లకే పరిమితమయ్యారు.

లాక్‌డౌన్ అనంతరం కూడా వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానాలు కొనసాగడంతో డిమాండ్ పూర్తిగా కోలుకోలేదు. ప్రస్తుతం రిజిస్టర్డ్ డబ్బావాలాల సంఖ్య 4,500 నుంచి సుమారు 1,500కు పడిపోయినట్లు సమాచారం.

మరోవైపు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, క్లౌడ్ కిచెన్లు ప్రజలకు కొత్త ప్రత్యామ్నాయాలను అందించాయి. ఒకప్పుడు నెలకు కేవలం రూ.2 వేలకే ఇంటి భోజనం అందించిన డబ్బావాలాలు, ఇప్పుడు అనేక పోటీ సేవలతో పోరాడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

డబ్బావాలా వ్యవస్థలో పనిచేసి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించిన అనేక మంది, ప్రస్తుతం జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలుగా మారుతున్నారు. ఒకప్పుడు ముంబయి గర్వంగా చెప్పుకున్న ఈ వ్యవస్థ, ఇప్పుడు మనుగడ కోసం పోరాడటం కాలం చేసిన మార్పుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Leave a Reply