కరీంగూడలో వైభవంగా మొహరం ఉత్సవాలు..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కరీంగూడ గ్రామంలో హజ్రత్ బారా ఇమామ్ దేవస్థానంలో శుక్రవారం ముహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానానికి చేరుకుని సవారీలను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసికట్టుగా పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా వేడుకలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ముహర్రం ఉత్సవాలకు జిల్లా నలుమూలలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.
భక్తులు మొక్కులు చెల్లించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీరు, విశ్రాంతి, ఇతర మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. గ్రామ యువకులు, వాలంటీర్లు సేవలందిస్తూ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. దేవస్థానం వ్యవస్థాపకుడు సయ్యద్ సాజిద్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తుల సహకారంతో ముహర్రం వేడుకలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించామని, ఈ వేడుకలు సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవస్థానం కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
