మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నీటి లభ్యతను బట్టి పంటల ప్రణాళిక రూపొందించాలి:
భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి..
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలి
నల్గొండలో నీటిపారుదల సలహామండలి సమావేశం..
పంటల ప్రణాళికపై అధికారులకు మంత్రి సూచనలు
నల్గొండ, ఆంధ్రప్రభ : జిల్లాలో నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన నీటిపారుదల సలహామండలి సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీతో పాటు మార్కెట్ కమిటీ, మున్సిపల్ చైర్మన్లు, నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వర్షపాతం, భూగర్భ జలాల పరిస్థితిపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రస్తుత నీటి లభ్యత, రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

క్షేత్రస్థాయిలో వర్షపాతాన్ని పరిశీలించాలి
వర్షపాతాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి అధికారులకు సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులకు ఇంకుడు గుంత తప్పనిసరి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వర్షం కురిసిన ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని, వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
తాగునీటికే తొలి ప్రాధాన్యం
జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు, నీటి లభ్యత తదితర వివరాలను జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి సమావేశంలో వివరించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి నిల్వలు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతాయని అధికారులు తెలిపారు. దీంతో తాగునీటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో కురిసే వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులకు వచ్చే నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
వరి సాగుపై వ్యవసాయ శాఖ హెచ్చరిక
జిల్లాలో ప్రస్తుత నీటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు వరి సాగు విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రాజెక్టులు, బోర్ల కింద అధికంగా వరి సాగు చేస్తే నీటి లభ్యత తగ్గిన దశలో పంట ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రానున్న కాలంలో బోర్లలోనూ భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్నందున నీటి అవసరం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. అందుబాటులో ఉన్న నీటిని తాగునీరు, సాగునీటి అవసరాలకు సమర్థంగా వినియోగించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
