రూ.36 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ మరమ్మతు పనులు

  • పనులు ప్రారంభించిన ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ
  • వాహనాల రాకపోకలు నిషేధం
  • ప్రజలు,ప్రయాణికులు సహకరించాలి

మోత్కూర్, ఆంద్రప్రభ: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గతేడాది కురిసిన విపరీతమైన వర్షాలకు మినీ ట్యాంక్ బండ్ (చెరువు కట్ట) కుంగడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు సైతం చేరువుకట్టను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ మరమ్మతుల కోసం నీటి పారుదల శాఖ తరపున రూ.36 లక్షలు నిధులు మంజూరు కాగా సోమవారం అట్టి మరమ్మత్తు పనులను సూర్యాపేట ఈ ఈ సత్యనారాయణ స్వయంగా ప్రారంభించారు.ప్రస్తుతం వర్షాలు అంతగా లేకపోవడంతో పనులు ప్రారంభించామని, ఈ రూట్లో బస్సులు,భారీ వాహనాల రవాణా ను నిషేధిస్తున్నట్లు ఈఈ తెలిపారు.

పాటిమట్ల ఎక్స్ రోడ్డు వద్ద సైతం రూట్ డైవర్షన్ కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలతో బారీకేడ్లు ఏర్పాటు చేశారు.తొర్రురు, సూర్యాపేట, తిరుమలగిరి నుండి హైదరాబాద్ కి వెళ్లే బస్సులు ,వాహనాలు అనాజీపురం మీదుగా వెళ్లాలని,హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలు సైతం అనాజీపురం ,పాటిమాట్ల మీదుగా తొర్రురు, సూర్యాపేట, తిరుమలగిరి కి వెళ్లాలని సూచించారు. చెరువు కట్ట మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టేవరకు ప్రజలు,ప్రయాణికులు, వాహనదారులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏ ఈ విక్రమ్,సిబ్బంది ఉన్నారు.