మెడికల్ షాపుల బంద్

మెడికల్ షాపుల బంద్
పుత్తూరులో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం
పుత్తూరు, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా ఔషధ వ్యాపారులకు ఎదురవుతున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పుత్తూరు పట్టణంలోని మెడికల్ షాపులు ఈరోజు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. ఉదయం నుంచే పట్టణంలోని పలు ఔషధ దుకాణాలు మూతపడటంతో ప్రజలు మందుల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ సందర్భంగా మెడికల్ షాపుల యజమానులు, ఔషధ వ్యాపారులు సంఘటితంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔషధ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
వ్యాపారులు మాట్లాడుతూ ఆన్‌లైన్ మందుల విక్రయాలను నియంత్రించాలని, చిన్న మెడికల్ షాపుల మనుగడకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఔషధ రంగంలో అమలవుతున్న కొన్ని విధానాల వల్ల చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా నాణ్యమైన మందుల విక్రయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ బంద్‌కు పుత్తూరు పట్టణంలోని మెజారిటీ మెడికల్ షాపులు మద్దతు తెలిపినట్లు సంఘ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మెడికల్ షాపుల యజమానులు, ఔషధ వ్యాపారులు పాల్గొన్నారు.
