AP | ప్రశాంతంగా సాగుతున్న మన్యం రాష్ట్ర బంద్‌…

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు, అందోళనలు
స్వచ్ఛందంగా బంద్‌కి సహాకరిస్తున్న వ్యాపారస్తులు
మన్యంలో మూతపడ్డ దుకాణాలు, వ్యాపార సముదాయాలు
రోడ్లెక్కిన ఆదివాసీ, గిరిజన సంఘాలు – రాకపోకలకు అంతరాయం
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామిని అమలు చేయాలని డిమాండ్‌
అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా సిద్దమే
చావో..రేవో తెలెవరకు పోరాటాలు సాగిస్తాం


AP |పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ బ్యూరో: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు 100 ఉద్యోగ రిజర్వేషన్‌ను అమలు చేయాలని, జీవో నెంబర్‌ -3కు ప్రత్యామ్నాయ చట్టంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరుతూ ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మన్యం రాష్ట్ర బంద్‌ పోలవరం (రంపచోడవరం) జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతొంది. ఈ బంద్‌ సందర్భంగా జిల్లాలోని 12 మండలాల్లో అన్ని వ్యాపార సముదాయాలు, దుకాణాలు, కిరాణ కొట్లు, కూరగాయాలు, ఇతర అన్ని రంగాలకు చెందిన షాపులు స్వచ్చంగా మూసివేసి మన్యం బంద్‌కు మద్దతు తెలిపారు.

ఆదివాసీ, గిరిజన సంఘాల నేతలు, నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఉదయాన్నే రోడ్లెక్కి, అన్ని ప్రధాన రహదారుల మీద నినాదాలతో నిరసనలు, అందోళనలు చేపడుతున్నారు. ప్రతి మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాల్లో ఈ బంద్‌ను నిర్వహిస్తున్నారు. రంపచోడవరం రెవిన్యూ డివిజన్‌ కేంద్రంలో, చింతూరు రెవిన్యూ డివిజన్‌ కేంద్రంలో పెద్ద ఎత్తున ఆదివాసీ, గిరిజన సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సంఘాలు రోడ్లెక్కడంతో వాహన రాకపోకలకు అంతరాయం వాటిల్లుతుంది. ఏజెన్సీలో వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోయి అర్ద గంటకి, అర్ధ గంటకి వాహనాలు వెళ్ళడానికి వెసులుబాటు ఇస్తున్నారు.

హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగాలకు సిద్దం…
ఏజెన్సీ, గిరిజన హక్కుల, చట్టాల సాధన కోసం ప్రాణ త్యాగాలకైనా సిద్దమేనని ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు ఉద్ఘాటిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల చట్టాల, హక్కుల పట్ల నిర్లక్ష్యదొరణిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏజెన్సీ గుండెకాయ అయిన 1/70 చట్టంపై నీలినీడలు అలముకున్నాయని అందోళన వ్యక్తం చేశారు. ఆదివాసీల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు, ఆర్టికల్స్‌, జీవోలు ఉన్నాయన్నారు. భారత దేశ ప్రధాని పంచశీల సూత్రాలు ప్రవేశపెట్టి ఏజెన్సీ ప్రాంతాల్లోని నీరు, భూమి, అడవులపై ఆదివాసీలకే హక్కులుంటాయని అనాడే చెప్పారని గుర్తు చేశారు. ఈనాడు అవే ప్రభుత్వాలు ఆదివాసీ, గిరిజన హక్కులను, చట్టాలను కాలరాస్తూ, నిర్విర్యం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదన చెందారు. రాష్టృ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల వేళ అరకు మహాసభలో ఏదైతే ఆదివాసీలకు హామి ఇచ్చారో, జీవో నెంబర్‌ -3 కు ప్రత్యాన్మయ చట్టం తీసుకొస్తానన్నారో, ఏజెన్సీలో ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పించి 100 శాతం స్థానిక గిరిజనులతోనే భర్తీ చేస్తానని చెప్పారో ఆ హామిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడుస్తున్న ఆ హామిని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య దోరణిలో ఉందని ఆరోపించారు. న్యాయస్థానాల్లో ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించకపోవడం, కౌంటర్లు దాఖలు చేయకపోవడం వలనే న్యాయస్థానాల్లో ఆదివాసీ చట్టాలు వీగిపోతున్నాయని ఆవేదన చెందారు. ఈ చట్టాలు, హాక్కులు పోవడం వలన ఆదివాసీలకి తీరని అన్యాయం, నష్టం జరిగిందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వాలు కూడా ఏజెన్సీకి గుండెకాయలాంటి 1/70 చట్టంపై కౌంటర్లు దాఖలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీని వలన 1/70 చట్టం కూడా పోయే ప్రమాదంలో ఉందన్నారు. ఆదివాసీల అడవులను గెంటివేసే ప్రయత్నాలు, కుట్రలను పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను, ప్రయత్నాలను ఆదివాసీలందరం కలసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఆదివాసీ హక్కుల, చట్టాల సాధన కోసం గిరిజనులందరం చావో, రేవో తెల్చుకునేంతరవరకు పోరాటాలు కోనసాగిస్తామని, అవసరమైతే ప్రాణ త్యాగాలకు సైతం సిద్దమవుతామని ఆదివాసీ, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ బంద్‌ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, చింతూరు జడ్పీటీసీ చిచ్చడి మురళి మద్దతు తెలిపి ఆదివాసీ సంఘాలతో ఆయన బంద్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు లోతా రామారావు, బొప్పెన కిరణ్‌, సీసం సురేష్‌, మడివి రవితేజ, పల్లపు వెంకట్‌, ఎంపీటీ-సీ రాజకుమార్‌, మొట్టుం రాజయ్య, కారం నగేష్‌, కారం సుబ్బారావు, పోడియం లక్ష్మణ్‌, సోడి ప్రియాంక, సవలం నారాయణ, ముర్రం పిడగయ్య తదితరులు పాల్గొన్నారు.